అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా..?

అగ్రరాజ్యం అమెరికాలో మహాసమరం మొదలయింది. రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. అమెరికా అధ్యక్ష పదవి అంటే ఎంతో శక్తిమంతమైన పదవి. అంతర్జాతీయ అంశాలపై అమెరికా అధ్యక్షుడి అభిప్రాయాలు మిగతా ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే అగ్రరాజ్యం ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంటుంది. ఈ సారి ఎన్నికలు.. కొవిడ్‌-19తో ప్రపంచమంతా అల్లకల్లోలమవడం, అమెరికాలో ఆఫ్రోఅమెరికన్ల నిరసనగళం వంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్నాయి. దీంతో ఇంకా ఆసక్తి పెరిగింది. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం

అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్‌కూ ఎన్నికలు
అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్‌కూ ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో కాంగ్రెస్‌ అంటే మన పార్లమెంట్‌ లాంటిది. అక్కడ కూడా రెండు సభలు ఉంటాయి. ఒకటి ప్రతినిధుల సభ- మన లోక్‌సభ లాంటిది. సెనేట్‌- మన రాజ్యసభలాంటిది. ప్రతినిధుల సభకు రెండేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికతో కలిపి ఒకసారి, రెండేళ్లయిన తర్వాత మరోసారి. ఈ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 435. ప్రస్తుతం డెమోక్రాట్ల ఆధిక్యంలో ఉంది. 100 స్థానాలున్న సెనేట్‌లో దాదాపు 35 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. సెనేట్‌ సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు.
ప్రజాస్వామ్యబద్ధంగా
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక కూడా ప్రజాస్వామ్య బద్ధంగానే ఉంటుంది. పార్టీ నేరుగా అభ్యర్థిని నామినేట్‌ చేయదు. ప్రతి పార్టీలోనూ ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీకి సుముఖం వ్యక్తం చేస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ ప్రైమరీలు, కాకస్‌లు జరుగుతాయి. ప్రైమరీలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. కాకస్‌ను పార్టీలు నిర్వహిస్తాయి. పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థులకు ప్రైమరీల్లో రిజిస్టర్డ్‌ ఓటర్లు ఓటు వేస్తారు. కాకస్‌లల్లో సాధారణంగా చర్చల ద్వారా ఒక అభిప్రాయానికి వస్తారు. వీటిల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకున్న వారే తుది అభ్యర్థిగా నిలుస్తారు. తుది అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడానికీ ఒక ప్రక్రియ ఉంటుంది. ఆయా పార్టీల జాతీయ సమావేశాల్లోనే వారిని అధికారికంగా ప్రకటిస్తారు. ఆయా రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రతినిధుల కేటాయింపు విధానం రెండు పార్టీలకు వేర్వేరుగా ఉంటుంది. డెమోక్రాట్లలో అయితే ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్లు, మద్దతుదారుల నిష్పత్తి ఆధారంగా వారికి ప్రతినిధులను కేటాయిస్తారు. రిపబ్లికన్లలో అయితే నైష్పత్తిక విధానంతో పాటు ‘విజేతకే మొత్తం ప్రతినిధులు’ అన్న విధానాన్ని కూడా అనుసరిస్తారు. అంటే ప్రైమరీలు, కాకస్‌లలో ఎక్కువ ఓట్లు సాధించిన వారికే మొత్తం ప్రతినిధులను కేటాయిస్తారు. మొత్తం మీద ఈ ప్రక్రియ సంక్లిష్టంగానే ఉంటుంది. రాష్ట్రానికీ, రాష్ట్రానికీ విధానం మారుతుంది.
పరోక్ష ఎన్నిక
అమెరికా అధ్యక్షుడు నేరుగా ప్రజల ఓట్లతో ఎన్నికవరు. పరోక్ష పద్ధతిలోనే ఎన్నికవుతారు. ఎలక్టోరల్‌ కాలేజ్‌లో అత్యధిక స్థానాలు సాధించిన వారే విజేత. అంటే ఎన్నిక రోజున ప్రజలు వాస్తవంగా ఓటు వేసేది ఎలక్టార్‌కు. ప్రతి రాష్ట్రానికి జనాభాను అనుసరించి ఎలక్టార్ల సంఖ్యను నిర్ణయిస్తారు. రెండు పార్టీలు ఎలక్టార్లను ఎంపిక చేసుకుంటాయి. మొత్తం 538 మంది ఎలక్టార్లు ఉంటారు. 270 అంతకన్నా ఎక్కువ మంది ఎలక్టార్లను గెలుచుకున్న పార్టీ అభ్యర్థే అధ్యక్షుడవుతారు.
రిపబ్లికన్‌ పార్టీని జీవోపీ అని కూడా పిలుస్తారు. అంటే గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ. ఇది సంప్రదాయవాద పార్టీ. తుపాకీ హక్కులను కొనసాగించాలని, వలసలపై నియంత్రణలు ఉండాలని ఈ పార్టీ వాదన. గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నట్లు కనబడుతోంది. జార్జి డబ్ల్యూబుష్‌, రొనాల్డ్‌ రీగన్‌, రిచర్డ్‌ నికల్సన్ తదితరులు ఈ పార్టీ తరఫున అధ్యక్షులుగా పని చేశారు.
డెమోక్రాటిక్‌ పార్టీ ఉదారవాద విధానాలు అవలంబిస్తుంది. వలసదారుల తరఫున గళం వినిపిస్తుంది.నగరప్రాంతాల్లో బలంగా ఉన్నట్లు కనబడుతోంది. జాన్‌ ఎఫ్‌ కెనెడీ, జిమ్మీకార్టర్‌, బిల్‌క్లింటన్‌, బరాక్‌ ఒబామా తదితరులు ఈ పార్టీ తరఫున అధ్యక్షులుగా పని చేశారు.
నవంబరులో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రకారం ఈ సారి 2020 నవంబరు 3న ఎన్నికలు జరుగుతాయి. కొత్త అధ్యక్షుడు జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తారు.

 9 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.