హాంకాంగ్‌పై వివాదాస్పద చట్టాన్ని తెచ్చిన చైనా

హాంకాంగ్‌ను మరింతగా తన ఉక్కు పిడికిలిలో బిగించేందుకు వివాదాస్పద ‘జాతీయ భద్రతా చట్టం’ ముసాయిదాను చైనా 2020 మే 22న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ చట్టం వల్ల హాంకాంగ్‌ ప్రాదేశిక స్వయంప్రతిపత్తి, ప్రజ వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర నష్టం వాట్లిుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రజాస్వామ్య అనుకూలవాదులు, వేర్పాటువాదులపై కొరడా ఝుళిపించడానికే దీన్ని తెస్తున్నారన్న విమర్శలున్నాయి.

  • ప్రబల ఆర్థిక శక్తి అయిన హాంకాంగ్‌ ప్రస్తుతం చైనాలో ప్రత్యేక పాలనా వ్యవస్థ(ఎస్‌ఏఆర్‌)గా ఉంది. 1997 జులై 1న ఈ ప్రాంతం.. బ్రిటన్‌ నుంచి చైనా అధీనంలోకి వచ్చింది. నాటి నుంచి ‘ఒక దేశం, రెండు వ్యవస్థు’ అనే విధానం ఇక్కడ అమల్లో ఉంది. దీని ప్రకారం చైనాలోని మిగతా ప్రాంతాల్లో లేని కొన్ని రకాల స్వేచ్ఛను హాంకాంగ్‌లో పొందొచ్చు. ఇక్కడ పరిమిత స్థాయిలో ప్రజాస్వామ్యం, పౌర హక్కులు అమల్లో ఉంటాయి.
  • హాంకాంగ్‌ ప్రత్యేక పాలనా ప్రాంతం(హెచ్‌కేఎస్‌ఏఆర్‌)లో న్యాయ వ్యవస్థ, భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని మెరుగుపరచడానికి ఈ బిల్లును తెస్తున్నట్లు చైనా తెలిపింది. దీన్ని చైనా పార్లమెంటు అయిన ‘నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌’ (ఎన్‌పీసీ)కు సమర్పించింది. హాంకాంగ్‌ ప్రాంతంలో చేపట్టే దేశద్రోహం, వేర్పాటువాద, విద్రోహ చర్యలు, విదేశీ జోక్యం, ఉగ్రవాదాన్ని నిషేధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని చైనా అధికారులు పేర్కొన్నారు. దాదాపు ఏడాదిగా చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో తీవ్రస్థాయిలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. 1997లో ఈ నగరాన్ని బ్రిటన్‌ నుంచి తన అధీనంలోకి తెచ్చుకున్నప్పుడు హామీ ఇచ్చిన రీతిలో విస్తృత రాజకీయ, పాలనాపరమైన స్వయంప్రతిపత్తిని ఇవ్వాలంటూ 2019లో దాదాపు 7 నెలల పాటు లక్షల మంది హాంకాంగ్‌ పౌరులు వీధుల్లో నిరసనలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ దీనికి విరామం వచ్చింది. తిరిగి 2020 మే నెలలో అవి ప్రారంభమయ్యాయి. హాంకాంగ్‌ చట్టసభ సభ్యులు అధికారాలను ఈ చట్టం హరిస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడి విపక్ష సభ్యులు చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
  • వివాదాస్పదమైన ఈ చట్టంపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని ముందే పసిగట్టిన చైనా.. భారత్‌ సహా అనేక దేశాల మద్దతు కోసం సందేశాలు పంపింది. కొత్త ముసాయిదా చట్టం తీసుకురావడానికి కారణాలను వివరించింది. హాంకాంగ్‌లో జాతీయ భద్రత పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో ఏ దేశమూ జోక్యం చేసుకోజాలదని కూడా స్పష్టం చేసింది. జాతీయ భద్రత అంశంలో చైనా రాజ్యాంగం, ప్రాథమిక చట్టాలకు అనుగుణంగా హాంకాంగ్‌ నడుచుకోవడంలేదని తెలిపింది.
  • హాంకాంగ్‌కు అధిక స్వయం ప్రతిపత్తి ఇస్తామని చైనా హామీ ఇచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. అందుకు భిన్నంగా తెస్తున్న తాజా చట్టం వల్ల స్వయంప్రతిపత్తిపై చావు దెబ్బ పడుతుందని తెలిపారు. చైనా ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఈ చట్టాన్ని హాంకాంగ్‌పై రుద్దుతోందని దుయ్యబట్టారు. ప్రమాదకరమైన ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు.

 48 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.