రెపో-రివర్స్‌ రెపో రేటును 0.4% తగ్గించిన RBI

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక రేట్లలో కోత విధించింది. రెపో రేటును మరో 40 బేసిస్‌ పాయింట్లను తగ్గించి 4 శాతానికి పరిమితం చేసింది. 2000 సంవత్సరం తర్వాత ఇది ఈ స్థాయికి చేరడం ఇప్పుడే. రివర్‌ రెపో రేటును సైతం 3.75% నుంచి 3.35 శాతానికి చేరుస్తూ 2020 మే 22న జరిగిన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాపై వడ్డీ రేటు తగ్గేందుకు వీలు కల్పించినట్లయింది. పరపతి విధాన కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో అయిదుగురు కీలకరేట్లలో 40 బేసిస్‌ పాయింట్ల కోతకు, చేతన్‌ఘటె మాత్రం 25 బేసిస్‌ పాయింట్ల కోతకు ఓటు వేశారు. సర్దుబాటు విధానాన్ని కొనసాగించడానికి MPC నిర్ణయించిందని RBI గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. అంటే అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉంటాయని పరోక్షంగా తెలియజేశారు.

  • కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో, ఆర్థిక వృద్ధిపై RBI తొలిసారిగా అధికారికంగా తన అంచనాను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ ప్రతికూలంగా నమోదు కావొచ్చని పేర్కొంది. దేశ పారిశ్రామికోత్పత్తిలో 60 శాతాన్నిచ్చే అగ్రగామి ఆరు పారిశ్రామిక రాష్ట్రాలు ఇంకా రెడ్‌, ఆరెంజ్‌ జోన్‌లో ఉండడంతో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని దాస్‌ వెల్లడిం చారు. ప్రైవేటు పెట్టుబడులు, వినియోగంపైనా తీవ్ర ప్రభావం కనిపించిందన్నారు. గిరాకీ క్షీణతతో పాటు సరఫరాలో ఇబ్బందుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడవచ్చని.. ద్వితీయార్థంలో పుంజుకోవచ్చని పేర్కొన్నారు.
  • కరోనా కారణంగా ద్రవ్యోల్బణంపై అంచనాలను చెప్పలేమని దాస్‌ అన్నారు. పప్పుధాన్యాల ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు ఇందుకు నేపథ్యమని ఆయన వివరించారు. 2020-21 తొలి భాగంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే నమోదు కావొచ్చని.. మూడు లేదా నాలుగో త్రైమాసికంలో 4 శాతం దిగువకు రావొచ్చని ఆయన అంచనా వేశారు.
  • కార్పొరేట్లకు ప్రస్తుత అర్హతగా ఉన్న మూలధనంపై 25% రుణ పరిమితిని 30 శాతానికి RBI పెంచింది. అంటే పెద్ద కంపెనీలు బ్యాంకు నుంచి మరిన్ని రుణాలను తీసుకోవడానికి వీలు కల్పించినట్లయింది.
  • రుణ వాయిదాలపై ఆగస్టు 31, 2020 వరకు మారటోరియాన్ని ప్రకటించడంతో పాటు.. మూలధనంపై వడ్డీ చెల్లింపులపైనా మూడు నెలల మారటోరియానికి RBI అనుమతులు ఇచ్చింది.
  • ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ.15,000 కోట్ల రుణ సహాయాన్ని అందించనుంది.
  • ఎగుమతులకు ముందు, తర్వాత బ్యాంకు నుంచి పొందే రుణాకిచ్చే గరిష్ఠ గడువును ప్రస్తుత 12 నెలల నుంచి 15 నెలలకు RBI పొడిగించింది. జులై 31లోగా చేసుకునే దిగుమతుకు చెల్లింపు గడువును 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది.
  • కొవిడ్‌-19 ప్రభావంతో ఆదాయం తగ్గిన/కోల్పోయిన రుణగ్రహీతలకు ఆర్‌బీఐ మరోసారి ఊరట కలిగించింది. మార్చి 27న ప్రకటించిన తొలివిడత మారటోరియం ప్రకారం మార్చి, ఏప్రిల్‌, మే నెల్లో చెల్లించాల్సిన నెలవారీ రుణకిస్తీ (EMI)ని వాయిదా వేయగా, ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించారు. అంటే మారటోరియం ఉపయోగించుకునే వారికి జూన్‌, జులై, ఆగస్టు నెలల ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అన్ని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణ, సూక్ష్మ రుణ సంస్థలు ఇచ్చిన అన్ని రకాల టర్మ్‌ రుణాలకూ ఇది వర్తించనుంది. మారటోరియాన్ని ఎంచుకున్న వారి వాయిదా చెల్లింపు సెప్టెంబరు 1 నుంచి తిరిగి ప్రారంభమవుతుంది.
  • మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీని రుణ సంస్థలు ఇప్పటికే ఉన్న అసలుకు కలిపి, కొత్తగా రుణ వ్యవధిని నిర్ణయిస్తాయి. లాక్‌డౌన్‌ కొనసాగింపు, వ్యక్తులు, సంస్థల ఆదాయాలు ఇంకా మెరుగుపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ తెలిపారు. మారటోరియాన్ని కొనసాగించడం వల్ల వ్యక్తులు, సంస్థలకు నగదు లభ్యత పెరుగుతుందని చెప్పారు. మారటోరియం సదుపాయం వల్ల ఈఎంఐ వాయిదా పడుతుంది కానీ, వాయిదా రద్దు కాదు. పైగా వడ్డీని అసలులో కపడం వల్ల రుణ వ్యవధి గణనీయంగా పెరుగుతోంది. కొవిడ్‌ వల్ల ఆదాయం తగ్గినవారికి, పూర్తిగా లేనివారికి ఇప్పటికిప్పుడు మారటోరియం వల్ల కాస్త ఊరట కలిగినప్పటికీ.. దీర్ఘ కాలంలో మాత్రం భారం తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే చాలామంది మారటోరియం తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. నగదు లభ్యత లేనివారే ఈ సదుపాయన్ని ఉపయోగించుకుంటున్నారు.

 8 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.