రెండో పెళ్ళితో దిల్ ‘కుష్’ రాజు

దిల్‌ రాజు..స్టార్‌ ప్రొడ్యూసర్‌..కేవలం హీరోలకు మాత్రమే కాదు ప్రొడ్యూసర్లకూ ఫ్యాన్స్‌ ఉంటారని నిరూపించి..నయా ట్రెండ్‌కు నాంది పలికిన సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌..ఇటీవల దిల్‌ రాజు పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తాత అయిన దిల్‌ రాజు తాజాగా రెండో పెళ్లి చేసుకుని నూతన వరుడిగా మారడంతో మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన టాపిక్కే వినిపిస్తోంది. మరి దిల్‌ రాజు రెండో పెళ్లి సంగతి ఏంటి..ఆయన పెళ్లికి కూతురు హన్సిత ఒప్పుకుందా..దిల్‌ రాజు మొదటి భార్య ఎలా చనిపోయింది..అసలు దిల్‌ రాజు సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవాడు..అతికొద్ది సమయంలో ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలు నిర్మించిన ఆయన సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో చూద్దాం..

దేవుడు బ్యాలెన్స్‌ చేశాడా..?

మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల దిల్‌ దోచుకున్న రాజు భార్య అనిత కొంతకాలం క్రితం గుండెపోటుతో మృతి చెందడం ఆయన జీవితంలో ఓ పెద్ద కుదుపేనని చెప్పొచ్చు. అప్పటికే ఒక్కగానొక్క కూతురు హన్సిత పెళ్లి చేయడం, జీవిత భాగస్వామి మృతి చెందడంతో దిల్‌ రాజు ఒంటరి అయ్యాడు. తనకు ఏదైనా చెడు జరిగితే భగవంతుడు వెంటనే తప్పక మరో మంచిని చేస్తూ బ్యాలెన్స్‌ చేస్తాడంటారు దిల్‌ రాజు. తను షేకింగ్‌లో ఉన్నప్పుడు తప్పక మ్యాజిక్‌ జరుగుతుందని నమ్మే దిల్‌ రాజు విషయంలో ఇప్పుడు జరిగింది అదే అనిపిస్తోంది. మొదటి భార్య మృతిచెంది షేకింగ్‌ అయిన దిల్‌ రాజు విషయంలో ఇప్పుడు జరిగిన రెండో పెళ్లి ఆ దేవుడు చేసిన మ్యాజిక్కే కావచ్చు.

ముందే హింట్‌..

సరే మరి..ఇప్పుడు దిల్‌ రాజు రెండో పెళ్లి విషయానికొస్తే..మే 10వ తేదీన దిల్‌ రాజు తేజస్విని అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిజామాబాద్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో దిల్‌ రాజు నిరాడంబరంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్‌ రాజు ఇటీవల సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుత పరిస్థితులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు..ప్రొఫెషనల్‌గా కూడా ఆటంకాలు చాలా ఉన్నాయి.. వీటి నుంచి కోలుకోవడానికి నాకు టైం రాలేదు. అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. నా జీవితంలో కూడా వ్యక్తిగత సమస్యలు దూరమవుతాయని భావిస్తున్నాను. అందుకు అనుగుణంగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను.. అందుకు ఇదే మంచి సమయంగా భావిస్తున్నా’ అంటూ పోస్ట్‌ పెట్టిన ఆయన దానికి అనుగుణంగానే మే 10న రెండో వివాహం చేసుకున్నాడు.

నైజాం రాజు..దిల్‌ రాజు ఎలా అయ్యాడు..?

ఎక్కడో చిన్న పల్లెటూరిలో పుట్టిన తాను మొదట ఆటోమొబైల్‌ రంగంలో ఉండి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ప్రొడ్యూసర్‌గా స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదగడం అంతా దేవుడి చలవే నంటారు దిల్‌ రాజు. చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడే సినిమా ఆడుతుందా ఆడదా అని అనలైజ్‌ చేసిన తాను మంచి సినిమాలు రూపొందించాలనే ఆలోచనతోనే ప్రొడ్యూసర్‌గా అవతారమెత్తానంటాడు దిల్‌ రాజు. డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నపుడు దిల్‌ రాజును నైజాం రాజు అనేవారట. నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నందువల్ల ఆయనకు ఆ పేరు వచ్చిందట. ఆ తర్వాత దిల్‌ సినిమా నిర్మాణంతో నైజాం రాజు పేరు కాస్తా దిల్‌ రాజుగా మారింది. మరి దిల్‌ రాజు అసలు పేరేంటో తెలుసా..ఆయన అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఇంట్లో ముద్దుగా రాజు అని పిలిచేవారట. కేవలం హీరోలకు మాత్రమే ఫ్యాన్స్‌ ఉండే పరిస్థితిలో మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్‌ చేసి ప్రేక్షకుల దిల్‌ను దోచుకుని దిల్‌ రాజుగా మారాడు.

దిల్‌ రాజు కష్టాల్లో వున్నప్పుడు ఆదుకుంది ఎవరు..?

డిస్ట్రిబ్యూటర్‌గా చేతులు కాల్చుకుని..ఇక సినిమా ఫీల్డ్‌కే గుడ్‌బై చెబుదామనుకున్న టైమ్‌లో ఓ ప్రొడ్యూసర్‌ చేసిన హెల్ప్ వల్లనే తానీ స్థాయిలో ఉన్నానంటారు దిల్‌ రాజు. ఆ ప్రొడ్యూసరే కాస్ట్యూమ్స్‌ కృష్ణ. ఆయన చలవ వల్ల సిద్దంబర్‌ బజార్‌లో ఆటోమొబైల్‌ షాప్‌ నడుపుకునే తనకు విజయం సిద్ధించిందని చెబుతారు దిల్‌ రాజు. కష్ట సమయంలో తన వెన్నుతట్టిన కాస్ట్యూమ్స్‌ కృష్ణ, ఫ్లాప్‌ పర్సన్‌గా పేరు పొందిన తాను కొన్న సినిమాలో అప్పటి స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఎం.ఎస్‌.రెడ్డి పార్ట్‌నర్‌షిప్‌ తీసుకోవడం తాను ఎన్నటికీ మరచిపోనంటాడు దిల్‌ రాజు. ఆ సినిమానే జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్లిపందిరి. సక్సెస్‌ సాధించిన పెళ్లిపందిరి సినిమా తన జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌ అంటారు దిల్‌ రాజు. క్రింది స్థాయి నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇప్పటికీ సినిమా నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానంటారాయన. మూవీ ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బు కంటే మూవీ సక్సెస్‌ ద్వారా వచ్చే డబ్బునే తాను కోరుంటానంటారు దిల్‌ రాజు. డబ్బులు ఊరికే రావు కదా అనే దిల్‌ రాజు ఆటిట్యూడ్‌ కూడా ఆహ్వానించదగ్గదే.

ప్రొడ్యూసర్‌గా దిల్‌ రాజు డామినేట్‌ చేస్తాడా..?

సినిమా ప్రొడ్యూసర్‌ అంటే కేవలం సినిమాకు పెట్టుబడి పెట్టే వ్యక్తి మాత్రమే అనే రూల్‌ను బ్రేక్‌ చేశాడనే పేరు దిల్‌ రాజుకు ఉంది. సినిమా విడుదలకు ముందే ఆ సినిమా హిట్టా లేక ఫట్టా అని చెప్పేస్తాడనే పేరు దిల్‌ రాజుకు సినీ వర్గాల్లో ఉంది. సినిమా విషయంలో కొన్ని సందర్భాల్లో సినిమా తాను అనుకున్నట్లుగానే రావాలని నిక్కచ్చిగా ఉంటాడనే పేరు కూడా దిల్‌ రాజుకు ఉంది. అయితే సినిమాకు డబ్బు పెట్టేది తాను కాబట్టి ఖచ్చితంగా సినిమా మంచిగా రావాలని తాను కోరుకోవడంలో తప్పు లేదంటాడు దిల్‌ రాజు. సినిమాలో హీరో, డైరెక్టర్ల రోల్‌ కొంత వరకే ఉంటుందంటాడాయన. ఒకవేళ సినిమా ఫ్లాప్‌ అయితే లాస్‌ అయ్యే డబ్బును ఎవ్వరూ ఇవ్వరు కాబట్టి సినిమా మొదట్నుంచీ ఒక క్యాలిక్యులేషన్‌తో వెళ్లడం మంచిదని..ఆ పంథానే తాను అనుసరిస్తానంటాడు దిల్‌ రాజు.

ఎవరిని తిడితే దిల్‌ రాజు రియాక్ట్‌ అవుతాడు..?

స్వతహాగా డిస్ట్రిబ్యూటర్‌ అయిన దిల్‌ రాజు సినీ డిస్ట్రిబ్యూటర్‌లను ఎవరైనా తిడితే మాత్రం ఊరుకోనని తప్పకుండా రియాక్ట్‌ అవుతానని చెబుతుంటాడు. చాలా మంది నిర్మాతల మైండ్‌ సెట్‌ డిస్ట్రిబ్యూటర్ల‌పై నెగెటివ్‌గా ఉంటుందని, సినిమా ఫ్లాప్‌ అయినపుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్‌ గురించి ఎవరూ ఆలోచించరట. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కూడా కక్కుర్తి పడే వారున్నారని దిల్‌ రాజు అంటుంటాడు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే ఎలాంటి సమస్యలు రావంటాడు దిల్‌ రాజు. తన ప్రస్థానం డిస్ట్రిబ్యూటర్‌గా మొదలైనందువల్ల వారిని ఏమైనా అంటే తట్టుకోలేనంటాడు దిల్‌ రాజు.

దేంట్లో షేర్‌ తీసుకోవడమంటే దిల్‌ రాజుకు ఇష్టం..?

సక్సెస్‌, ఫెయిల్యూర్ ల‌ను పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్లడమే తనకు ఇష్టమంటాడు దిల్‌ రాజు. సక్సెస్‌, ఫెయిల్యూర్ అనేది ఇంపార్టెంట్‌ కాదని… మొదట మనం మనుషులము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటాడు. సక్సెస్‌ అనేది టాలెంట్‌తో వస్తుందని..సక్సెస్‌లో తనకు ఎవరైనా షేర్‌ ఇస్తే…తాను మాత్రం ఫెయిల్యూర్లో కూడా షేర్‌ తీసుకోవడానికి ఇష్టపడతానంటాడు దిల్‌ రాజు. సక్సెస్‌కు పొంగిపోకుండా, ఫెయిల్యూర్ కు కుంగిపోకుండా ఉండాలనే దిల్‌ రాజు ఆలోచనా విధానం ఏ ఫీల్డ్‌ వారికైనా ఇన్‌స్పిరేషనే అనే విషయంలో ఎటువంటి సందేహం లేదనుకుంటా

మొదటి భార్య పేరు వల్లనే సక్సెస్‌లు వచ్చాయా..?

దిల్‌ సినిమా అప్పుడు శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ ఏర్పాటు చేసే సమయంలో కాచిగూడకు చెందిన నర్సింహారావు సిద్ధాంతి చెప్పినట్ట తన భార్య పేరు వచ్చే విధంగా శ్రీమతి అనిత ప్రెసెంట్స్‌ అని పేరు పెట్టారు. ఈ విషయంలో దిల్‌ రాజుకు, అనితకు మధ్య చిలిపి ఘర్షణలు కూడా జరిగేవట. తన పేరు వల్లనే సక్సెస్‌లు వస్తున్నాయని అనిత అంటే..నేను కష్టపడకుండానే కేవలం నీ పేరు వల్లనే సక్సెస్‌లు వస్తున్నాయా అని దిల్‌ రాజు అనేవారట. కానీ తన భార్య తనకు ఇచ్చిన సపోర్టు వర్ణించలేనిదని దిల్‌ రాజు చెప్పడం వారి అన్యోన్య జీవితానికి అద్దం పడుతుంది. వీరి అన్యోన్య జీవితం, చిలిపి ఘర్షణలు చూసి ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో..అందుకే అనిత గారిని రాజుకు దూరం చేశాడు.

స్వాగతించిన కూతురు హన్సిత

దిల్‌ రాజు రెండో పెళ్లిని ఆయన కూతురు హన్సిత ఒప్పుకుందా లేదా అనే అనుమానం మీకు రావొచ్చు. తండ్రి రెండో పెళ్లిని మనస్ఫూర్తిగా స్వాగతించింది హన్సిత. తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను కూడా పెట్టింది. డియర్‌ డాడ్‌.. నువ్వు నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచావు. మీ వలన అందరం సంతోషంగా ఉన్నాం. మన కుటుంబ సంతోషం కోసం మీరు ఎన్నో చేశారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. మీరిద్దరు సంతోషంగా ఉండాలని, ప్రతి రోజు అద్భుతంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని హన్సిత సోషల్‌ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. దీంతో మాతృ దినోత్సవం రోజున తన తల్లి అనిత స్థానంలో తండ్రి జీవితంలోకి వచ్చిన యువతికి హన్సిత స్వాగతం పలికినట్లయింది.
జీవితంలో ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు సహజమని…షేకింగ్‌లో వున్నప్పుడు దేవుడు తప్పక మ్యాజిక్‌ చేస్తాడని నమ్మే దిల్‌ రాజు..మొదటి భార్య మృతితో కాస్త కుంగిపోయినప్పటికీ..రెండో భార్య రాకతో మళ్లీ మునుపటి ఉత్సాహంతో రాణిస్తూ, మనందరినీ మంచి మంచి సినిమాలతో అలరిస్తూ దిల్‌కుష్‌గా ఉండాలని కోరుకుందాం..

 35 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.