ఎక్కడ ఓడామో అక్కడే నెగ్గాలి

అఖిలభారత స్థాయిలో అనంత అమ్మాయి ప్రతిభతో వికసించింది. ఎక్కడ ఓడామో అక్కడే నెగ్గాలనే పట్టుదలతో శ్రమించి మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. సివిల్‌ సర్వీసు సాధించాలన్నది లక్షలాది మంది కల. ఆకల సాకారం అయ్యేది ఏ కొద్దిమందికో. కరవు సీమ నుంచి తన సత్తా చాటి సివిల్‌ సర్వీసు ర్యాంకు సొంతం చేసుకుంది. తాడిపత్రి మండలం కొండేపల్లికి చెందిన న్యాయవాది మద్దిపట్ల మనోహర్‌నాయుడు, శిశు సంక్షేమ, మహిళాభివృద్ధి శాఖ సీడీపీఓ కృష్ణకుమారి కుమార్తె ప్రసన్నకుమారి. వృత్తి రీత్యా అనంతపురంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. యూపీపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ తుది ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. ప్రసన్నకుమారి జాతీయ స్థాయిలో 513 ర్యాంకు సాధించింది.
అనంతలోనే విద్యాభ్యాసం
ప్రాథమిక విద్య అంతా అనంతపురంలోని గిల్డ్‌ ఆఫ్‌ సర్వీసు ఎయిడెడ్‌ పాఠశాలలో పూర్తి చేసింది. పదో తరగతిలో 554 మార్కులతో పాఠశాల ప్రథమురాలిగా నిలిచింది ఇంటర్‌ అనంతపురంలోని శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ 981 మార్కులు సాధించింది ఎంసెట్‌ రాసి కర్నూలు పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసింది. టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చినా వద్దనుకొని సివిల్స్‌ వైపు తన ప్రయాణం సాగించింది.
ఆ తప్పు సరిదిద్దుకొని విజయం..
ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో సివిల్స్‌ సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. మొదటిసారి ఎలాంటి శిక్షణ లేకుండానే పరీక్షకు హాజరయింది. అప్పుడే తెలుసుకొంది. కచ్చితంగా సాధించవచ్చు అని. రెండోసారి ప్రయత్నం చేసింది. కనీసం అర్హత కూడా సాధించలేక పోయింది ఎక్కువగా చదివినా రాకపోయేసరికి ఎక్కడ తప్పు చేశారో తెలుసుకుంది. కేవలం చదవడం మాత్రమే చేయడం వల్ల ఆశావహ ర్యాంకు రాలేదని గుర్తించింది ఎక్కువగా మాదిరి పరీక్షలు రాసి సాధన చేసింది.
ప్రణాళికే విజయ రహస్యం
– ప్రసన్నకుమారి
శిక్షణ తప్పనిసరి మాత్రం కాదు. అక్కడ కేవలం సిలబస్‌ తరహాలో మాత్రమే చెబుతారు. ఇంజినీరింగ్‌ చేసినా పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎంపిక చేసుకున్నా. విస్తృతమైన సిలబస్‌ ఉంటుంది. రోజుకు ఇన్ని గంటలు అని చదవలేదు. ఎప్పుడు ఏది చదవాలో ప్రణాళిక వేసుకొని అది పూర్తి అయ్యే వరకు చదివాను. కఠోర సాధన, సాధించాలన్న తపన, కుటుంబం అండ ఉండటం వల్లే సాధించా. ఇటీవల ప్రకటించిన గ్రూపు-1 పరీక్షల్లో 465 మార్కులు రావడంతో డీఎస్పీకి ఎంపిక అయ్యా. సివిల్‌ సర్వీసులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ రాకపోవచ్చేమో. మంచి పోస్టు కంటే ప్రజలతో సంబంధాలు ఉన్న పోస్టు వస్తే చేరుతా. లేదంటే డీఎస్పీగా చేరుతా. నా విజయం వెనుక అమ్మా, నాన్నలే స్ఫూర్తి.

 38 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.