ఉన్నత స్థానాన్ని సాధించాలనుకున్నపుడు కొన్నింటిని వదులుకోక తప్పదు

బాల్యంలోనే ఉన్నత ఆశయానికి బీజం..
లక్ష్య సాధనకు గంటల తరబడి సాధన..
గమ్యం చేరడానికి ఎన్నింటినో వదులుకున్నాడు..
అనారోగ్యం ‘పరీక్ష’ పెట్టినా పట్టువీడలేదు..
కదలలేని స్థితిలో ఉన్నా పరీక్షకు హాజరయ్యాడు..
393వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచాడు.
కామారెడ్డి జిల్లా సంయుక్త పాలనాధికారి
కుమారుడు ఆదర్శ్‌ సివిల్స్‌ విజయగాథ ఇది.
కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన సురభి సత్తయ్య కామారెడ్డి జిల్లా సంయుక్త పాలనాధికారిగా కొనసాగుతున్నారు.ఈయన పెద్ద కుమారుడు ఆదర్శ్‌ రెండు రోజుల కిందట విడుదలైన సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి ప్రశంసలు అందుకొన్నారు.
శంకరణ్‌ రాసినా పుస్తకమే ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్‌ అధికారి శంకరణ్‌ రాసిన పుస్తకమే… నా ఉన్నత లక్ష్యసాధనకు దోహదపడింది. అమ్మానాన్నలు, ఉన్నతాధికారులు ప్రదీప్‌చంద్ర, రత్నప్రభ, వైవీరెడ్డి లను స్ఫూర్తిగా తీసుకొన్నాను. వారిలా ఎదగాలని నిశ్చయించుకొన్నాను. ఇందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాధన చేశాను.
సామాజిక మాధ్యమాలకు దూరంగా
ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను వినియోగించనట్లయితే కాలం గడవదు అన్నట్లుగా ఉంది.. కానీ ఉన్నత ఆశయాన్ని సాధించాలనుకున్నపుడు కొన్నింటికి దూరంగా ఉండక తప్పదు. ప్రధానంగా పరీక్షలకు కొన్ని నెలల ముందు నుంచే చరవాణిని వినియోగించడం తగ్గించడంతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి వాటికి దూరంగా ఉన్నాను. సినిమాలను చూడడమే మానేశాను. సరదాలకు విశ్రాంతి పలికాను.
రోజుకు ఎనిమిది గంటలు చదివా
నిత్యం ఎనిమిది గంటల పాటు పుస్తకాలను చదివాను… ప్రధానంగా ప్రాథమిక అంశాలపై పూర్తిగా అవగాహన పెంచుకొనేందుకు విజ్ఞానపత్రికలతో పాటు దినపత్రికలను తప్పకుండా చదివాను. ప్రణాళికాబద్ధంగా విషయ సముపార్జన చేయడంతో సివిల్స్‌ సాధన సులభతరమైంది.
ఇంటర్వ్యూలో ఇలా
సివిల్స్‌లో ఇంటర్వ్యూలో ప్రధానమైన ఘట్టం. దీనిని ఎదుర్కొనేందుకు ముందునుంచే ఒక ప్రణాళికను రచించుకొన్నాను. ఫలితంగా ముఖాముఖిని సులభంగా ఎదుర్కొన్నాను. ఇందులో ప్రస్తుత తాజా పరిణామాలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి మన రాష్ట్ర విశేషాలు.. ,రాష్ట్రం సాధించుకొన్న తర్వాత వచ్చిన ఫలితాల గురించి అడిగారు. ప్రస్తుతం రిజర్వేషన్ల అంశం చర్చగా ఉండడంతో దీనిపై కూడా ప్రశ్నించారు. మావోయిస్టు ప్రాబల్యం గల ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగారు. ఆయా అంశాలపై పరిజ్ఞానం ఉండడంతో తేలికగా సమాధానాలిచ్చాను. సివిల్స్‌ రాయాలనుకునే వారు ఎప్పటికప్పుడు సమకాలీన పరిస్థితులతో పాటు మన ప్రాంతంలో జరుగుతున్న విషయాలు, స్థానిక అంశాలపై పూర్తిగా అవగాహన కలిగిఉండాలి.
వైద్యుల సూచనను సైతం పక్కన పెట్టా
ఒక విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్నపుడు అవరోధాలు రావడం సహజమే. అన్ని అనుకూలించినప్పటికీ సివిల్స్‌ ప్రధాన పరీక్షకు కొద్దిరోజుల ముందు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యా.దీంతో వైద్యులు కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.కానీ వైద్యులతో మాట్లాడి లక్ష్యసాధనకు విశ్రాంతిని సైతం పక్కన పెట్టి పరీక్షలకు హాజరయ్యాను. మూడు గంటల పాటు కూర్చుండి పరీక్షరాయడానికి ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తినప్పటికి నా లక్ష్యాన్ని గుర్తుచేసుకొని సానుకూల దృక్పథంతో వ్యవహరించి పరీక్షలను రాశాను. విజేతగా నిలవాలనుకున్నపుడు అవరోధాలు రావడం సహజమే. కానీ వాటిని ఎదుర్కొని ముందుకెళ్లినపుడే ఫలితాన్ని సాధిస్తాం.
విద్యాభ్యాసం సాగిందిలా
పూర్వప్రాథమిక తరగతులతో పాటు నాలుగోతరగతి వరకు వరంగల్‌లో పూర్తిచేశాను. ఐదో తరగతి నుంచి పన్నెండో వరకు దిల్లీలో విద్యాభ్యాసం సాగింది. తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్లడంతో ఉన్నత విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది.తదనంతరం ఒక సంవత్సరం పాటు హైదరాబాద్‌లో శిక్షణ పొంది దిల్లీ ఐఐటీలో సీటు సాధించాను. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను.సివిల్స్‌ మొదటసారి రాసి ప్రిలిమ్స్‌ వరకు చేరకొన్నాను.ముగ్గురు స్నేహితులం కలిసి దిల్లీలో ఉండి సివిల్స్‌కు ప్రత్యేకంగా సిద్ధం అయ్యాను.నాతో పాట నా స్నేహితుడు సైతం సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు.
తొలి ఉద్యోగాన్ని వదులుకొని
దిల్లీలోని ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేయడంతో ఓ కంపెనీలో వచ్చిన తొలి ఉద్యోగాన్ని వదులుకొని సివిల్స్‌కు సిద్ధం అయ్యాను.ఏడాది పాటు అకుంఠిత దీక్షతో సన్నద్ధం అయ్యాను. ప్రధానంగా ఏకాగ్రతతో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో పాటు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రభుత్వ పుస్తకాలను చదివాను. ఐఐటీ చివర సంవత్సరం నుంచే సివిల్స్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభించాను.2016లో మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో నేను వెనుకబడిన సబ్జెక్టులపై మరింతగా దృష్టిపెట్టాను.వార్తాపత్రిలకు, యోజన, ఇయర్‌బుక్‌లను పూర్తిగా శ్రద్దతో చదివాను.
విద్య,వైద్యానికే తొలిప్రాధాన్యం
విదుల్లో చేరిన తర్వాత విద్య, వైద్యరంగాలకు తొలిప్రాధాన్యం ఇస్తాను. ప్రధానంగా అట్టడుగు వర్గాల వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తాను.ప్రజల మన్ననలు పొందేలా కృషి చేస్తాను. తల్లిదండ్రులకు తగ్గ తనయునిగా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా నిర్వహిస్తాను.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
మనము ఒక ఉన్నత స్థానాన్ని సాధించాలనుకున్నపుడు కొన్నింటిని వదులుకోక తప్పదు. ప్రధానంగా చరవాణి, టీవీ, సినిమా వంటి వాటితో పాటు ముఖపుస్తకం, వాట్సాప్‌లకు బానిస కాకుండా ఉండాలి. అవసరమేరకు వాడుకోవాలి. మనము ఎన్నుకున్న లక్ష్యసాధన కోసం ప్రణాళిక అనేది ముఖ్యం. ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో,సాధించగలననే నమ్మకంతో ముందడుగు వేయాలి.

 32 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.