పట్టుదలే పెట్టుబడి

‘కలలు కనండి.. వాటి సాకారానికి నిరంతరం శ్రమించండి’ అన్న అబ్దుల్‌కలాం మాటలను నిజం చేశాడు ఆ యువకుడు. మనసులో మెరిసిన తన ఆలోచనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, మిత్రుల సహకారం తోడవ్వడంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. పట్టుదలే పెట్టుబడిగా నిరంతరం శ్రమిస్తూ కలను సాకారం చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామానికి చెందిన శీలం సాయితేజ సివిల్స్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచాడు. చదివింది ఇంజినీరింగు అయినా చిన్నతనం నుంచే సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో సాయితేజ రెండేళ్ల పాటు శ్రమించి విజయం సాధించాడు.
కుటుంబ నేపథ్యం..
మర్మాములకు చెందిన శీలం సుధాకర్‌ గౌడ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో పోలీసు గృహనిర్మాణ సంస్థలో డిప్యూటీ ఈఈగా పని చేస్తున్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల, నల్గొండ జిల్లాలో పనిచేసిన ఆయన 2002లో హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. భార్య వాణి ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయితేజ సివిల్‌ సర్వీసుకు ఎంపికవగా కూతురు ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ తమ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్న సుధాకర్‌ గౌడ్‌కు స్వగ్రామం మర్మాములలో స్థిరాస్తులు ఉన్నాయి. వీలైనప్పుడల్లా స్వగ్రామానికి వస్తుంటారు.
సాయితేజ విద్యాభ్యాసం..
సివిల్‌ సర్వీసు ఫలితాల్లో జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు సాధించిన శీలం సాయితేజ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. 2010లో హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని సెయింట్‌పాల్‌ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం నల్లకుంట శ్రీ చైతన్య కళాశాలలో 2012లో ఇంటర్‌ పూర్తి చేశారు. 2016లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధమవ్వడం ప్రారంభించారు. కుమారుని పట్టుదల, ఆసక్తిని గమనించిన సుధాకర్‌ అతడిని అన్ని విధాలా ప్రోత్సహించారు. తండ్రి సూచన, ప్రోత్సాహంతో సాయితేజ 2016లో దిల్లీకి వెళ్లి శిక్షణ పొందారు.
మొదటి ప్రయత్నంలోనే..
పట్టుదల, సరైన ప్రణాళిక, నిరంతర శ్రమ, కృషి ఉంటే అనుకున్నది సాధించవచ్చని సాయితేజ నిరూపించారు. ఇంజినీరింగ్‌ పూర్తవ్వగానే ఉద్యోగం వెతుక్కోకుండా నాన్న కోరిక మేరకు తనకున్న ఆసక్తితో సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. దిల్లీ వెళ్లిన ఆయన అక్కడి ఐఏఎస్‌ శిక్షణా కేంద్రంలో చేరారు. 2017లో ప్రిలిమ్స్‌ రాశారు. అదే సంవత్సరం నవంబరులో నిర్వహించిన ప్రధాన పరీక్షకు పొలిటికల్‌ సైన్సు, అంతర్జాతీయ సంబంధాలు అనే అంశాలను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. 2018 మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించారు.
సామాజిక సేవలందించాలని…
మారిన పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి సేవలందించాలన్న ఆలోచనతో సివిల్స్‌ వైపు మళ్లినట్లు సాయితేజ తెలిపారు. సాధారణ పౌరుడిగా కంటే ఉన్నతమైన స్థానంలో ఉంటూ సేవ చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. . ప్రిలిమ్స్‌ పరీక్షలు రాసిన తర్వాత మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధిస్తాననే గట్టి నమ్మకం ఏర్పడిందన్నారు. ఇందుకోసం రోజూ 8 గంటలు చదివినట్లు తెలిపారు. సివిల్స్‌కు సన్నద్ధం అయ్యే అభ్యర్థులు ప్రణాళికతో చదువుతూ పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర శ్రమతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తారని తెలిపారు.

 38 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.