ప్రియుడితో కలిసి ఓ యువతి అఘాయిత్యం

కుటుంబంలో ‘అమ్మ’ స్థానం అపురూపం. ఇంటిని చక్కదిద్దినా.. పిల్లలను తీర్చిదిద్దినా ఆమె తప్ప మరెవరూ భర్తీ చేయలేని స్థానమది. విచ్చలవిడి సంస్కృతి మానవత్వాన్ని కాలరాస్తున్న ఈ తరుణంలో ఇప్పుడామె స్థానం చెదిరిపోతోంది.. ఇంటి పెద్ద తన ఇంట్లో తానే శత్రువైపోతోంది.

కట్టుతప్పిన బిడ్డను అదుపులో పెట్టే క్రమంలో హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఓ తల్లి కుమార్తె చేతిలోనే దారుణ హత్యకు గురైంది. రెండు పదుల వయసులేని యువతి ప్రియుడితో కలిసి తల్లిని చంపి.. మృతదేహాన్ని మూడు రోజులపాటు ఇంట్లోనే ఉంచి అతడితో గడిపింది.. ఆపై ఇద్దరూ కలిసి రైలు పట్టాల మీద శవాన్ని పడేసి వచ్చారు.

మరో సంఘటనలో అనారోగ్యం కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి చెదిరిపోవడంతో ఓ కుటుంబంలో మొదలైన కలహాలు తల్లే స్వయంగా ఇద్దరు బిడ్డలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితికి దారితీశాయి. ఈ దయనీయ ఉదంతం జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.


హైదరాబాద్‌ : రెండు పదుల వయసైనా లేని ఓ యువతి వేసిన తప్పటడుగు ఒక కుటుంబంలో చిచ్చుపెట్టింది.. ఒక కుర్రాడితో ప్రేమలో పడి.. మరో కుర్రాడితో సన్నిహితంగా గడిపి.. ఇవన్నీ కాదన్నందుకు కక్ష పెంచుకుని.. తల్లిని చంపేసింది. మూడురోజులు మృతదేహంతోపాటు అదే ఇంట్లో ప్రియుడితో కలిసి గడిపింది. చివరకు శవాన్ని రైలు పట్టాలపై పడేసివచ్చి ఏం తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ పరిధిలో జరిగింది.యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి అనే లారీ డ్రైవర్‌ భార్య రజిత (38), కుమార్తె కీర్తి (19)తో కలిసి హయత్‌నగర్‌ పరిధిలోని మునగనూరుకు వలసవచ్చారు. అక్కడే ద్వారకామయినగర్‌ కాలనీలో ఇల్లు కొనుక్కుని ఉంటున్నారు. కీర్తి తమ ఇంటికి సమీపంలోని బాల్‌రెడ్డి అనే యువకుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలియడంతో ఇద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే అప్పటికే ఆమె గర్భం దాల్చింది. ఏం చేయాలో తోచక ఆమె అదే కాలనీలో తాను అన్నయ్యా అంటూ పిలిచే శశికుమార్‌ అనే యువకుడి సాయం కోరింది. గర్భస్రావం చేయించిన అతడు దానిని అవకాశంగా తీసుకుని.. బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. తరచూ అతడిని కలుస్తున్న విషయం తల్లి రజితకు తెలిసి కీర్తిని తీవ్రంగా హెచ్చరించింది. ఇది తెలిసి ‘మీ అమ్మను చంపేస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చంటూ’ శశికుమార్‌ కీర్తికి నూరిపోశాడు. ఈ నెల 19న తండ్రి పనిలోకి వెళ్లడంతో శశిని ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి రజితను మట్టుబెట్టారు. శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టారు. అతడు రోజూ రాత్రి ఇంటికి వచ్చేవాడు. దుర్వాసన వస్తుండటంతో 22న రాత్రి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి రామన్నపేట వద్ద రైలుపట్టాలపై పడేసి వచ్చారు. తన తల్లి ఫోన్‌ నుంచి బాల్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి రజితలా మాట్లాడింది. ఆరోగ్యం బాగాలేక నల్గొండ ఆసుపత్రికి వెళ్లానని కీర్తిని మీ ఇంట్లోనే ఉంచుకోవాలంటూ చెప్పింది. తర్వాత వాళ్లింట్లోకి మకాం మార్చింది.
తండ్రి మీదకు నెట్టేసే యత్నం..
ఈ నెల 24న ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి.. తాళం వేసి ఉండటం చూసి భార్యకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కూతురిని సంప్రదిస్తే.. ఒకసారి విశాఖ వెళ్లానని, మరోసారి స్నేహితుల ఇంట్లో ఉన్నానంటూ రకరకాలుగా చెప్పింది. దీంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. 25న మళ్లీ వచ్చినా భార్య కనిపించలేదు. పూటుగా తాగి హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన అతడు తన భార్య కనిపించడంలేదంటూ ఏడ్చాడు. మత్తు దిగాక మర్నాడు రమ్మని పోలీసులు పంపేశాడు. ఈ నెల 26న కీర్తి తన తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా ‘నాన్న తాగి ఇంటికొచ్చి అమ్మతో గొడవపడుతుంటాడని’ చెప్పింది. ఆదివారంనాడు శ్రీనివాసరెడ్డి తన సోదరుడితో కలిసి బలవంతంగా ఇంటి తలుపులు తెరిచాడు. లోపల చూశాక ఏదో జరిగి ఉంటుందని వారికి అనుమానమొచ్చింది. కీర్తిని గద్దించి అడిగితే జరిగినదంతా వివరించింది. హయత్‌నగర్‌ పోలీసులు కీర్తి, శశికుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. ‘మేం బాల్‌రెడ్డితో పెళ్లి చేయాలని అనుకున్నాం. కీర్తి కూడా ఒప్పుకుంది. అయితే.. ఆ తర్వాత శశిని ప్రేమిస్తున్నా. అతన్నే చేసుకుంటానని చెప్పింది. కాదన్నందుకే కక్ష పెంచుకుని ఇద్దరూ కలిసి నా భార్యను చంపేశారు’ అని శ్రీనివాస్‌రెడ్డి వాపోయాడు. ఒక్కతే కుమార్తె కావడంతో ఆస్తంతా తనకు దక్కుతుందని భావించే కీర్తిని.. శశికుమార్‌ లొంగదీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Comment