Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
సుధీర్ రెడ్డి ప్రక్షాళన చేపట్టేనా..? – Success Secret

సుధీర్ రెడ్డి ప్రక్షాళన చేపట్టేనా..?

హైదరాబాద్‌, ఎల్బీనగర్‌ : రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యంతో మూసీ కాస్తా మూ‘ఛీ’గా మారింది. ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితం కావడంతో అధ్వాన స్థితికి చేరుకుంది. నిధుల లేమి, సిబ్బంది కొరతతో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలెప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌ఎఫ్‌డీసీ) చేతులెత్తేసింది. తాజాగా ఎంఆర్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని నియమించడంతో ప్రక్షాళన పనులు పట్టాలెక్కే అవకాశముందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అనుకున్నట్లే కేబినెట్‌ ర్యాంకు..
గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో మూసీని ప్రక్షాళనను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎంఆర్‌డీసీఎల్‌ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా ప్రేమ్‌సింగ్‌ రాథోర్‌ను నియమించింది. మూడు దశల్లో మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. 2017-18, 2018-19 బడ్జెట్‌లో రూ.754 కోట్లు కేటాయించింది. తీరా చూస్తేనేమో రూ.3.12 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఆ డబ్బులు కార్యాలయం నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, ఇతర అవసరాలకే సరిపోయింది. రెండు, మూడుసార్లు వివిధ నగరాల్లో పర్యటించి అధికారులు హడావుడి చేశారు. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి తెరాస తరఫున టిక్కెట్‌ దక్కడంతో ప్రేమ్‌సింగ్‌ రాథోర్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఎండీ అశోక్‌రెడ్డి కూడా అక్కడి నుంచి ఆర్థికమంత్రి హరీష్‌రావు పేషీలోకి వెళ్లడంతో ఎంఆర్‌ఎఫ్‌డీసీ మరింత నిస్తేజంగా మారింది. కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికలకు ముందు తెరాసలో చేరారు. అప్పటి నుంచి కూడా ఎంఆర్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తారనే ప్రచారం జరిగింది. కేబినెట్‌ ర్యాంకుతో నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మంత్రి కేటీఆర్‌కు దగ్గరై..

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. తెరాసలో చేరిన ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులవడంతో నేతలు సంబరాల్లో మునిగిపోయారు. తెరాసలో చేరిన అనతికాలంలోనే ఆయన అధిష్ఠానానికి దగ్గరయ్యారు. మంత్రి కేటీఆర్‌ వద్ద మంచి పేరు సంపాదించుకున్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్‌ను తరచూ కలిసి విన్నవించేవారు.

ఈ క్రమంలోనే ఆయనపై సీఎం కేసీఆర్‌కు సైతం సదభిప్రాయం ఏర్పడింది. ఈనేపథ్యంలోనే ఎంఆర్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించారనే ప్రచారం జరుగుతోంది. 1984లో కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిన సుధీర్‌రెడ్డి ఎన్నో పదవులు చేపట్టారు. అక్బర్‌బాగ్‌ మున్సిపల్‌ కార్పొరేటర్‌గాను, హుడా ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు సైతం పొందారు. 2014లో ఓటమి పాలైనా.. తిరిగి 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!