వెనెజువెలా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. అధ్యక్షుడు నికోలస్‌ మడురోకు వ్యతిరేకంగా తిరగబడాలని అమెరికా మద్దతున్న విపక్ష నాయకుడు జువాన్‌ గ్వాడో దేశ సైన్యానికి పిల పునివ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రాజధాని కరాకాస్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని గ్వాడో సూచనలకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కఠినంగా వ్యవహరించాలని మడురో తన బలగాలను ఆదేశించడంతో సైన్యం కాల్పులు, బాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులతో ఆందోళనకారులను చెదరగొట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గ్వాడోకు మద్దతు ప్రకటించారు.