బెయిల్‌ షరతులను ఉల్లంఘించినందుకుగాను వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌కు యూకేలోని ఓ న్యాయస్థానం 2019 మే 1న 50 వారాల జైలుశిక్ష విధించింది. యూకే బెయిల్‌ చట్టాన్ని అతను ఉల్లంఘించినట్లు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తేల్చింది. గతంలో రహస్య పత్రాలను బహిర్గతం చేసిన వ్యవహారంలో తనను అమెరికాకు అప్పగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అసాంజ్‌ ఏడేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాయలంలోనే ఆశ్రయం పొందారు. ఈక్వెడార్‌ ప్రభుత్వం అసాంజ్‌కు ఆశ్రయాన్ని ఉపసంహరించడంతో ఇటీవల అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కోర్టు తీర్పును వెలువరించింది. ‘‘యూకేలోనే ఉంటూ రాయబార కార్యాయలంలో దాక్కోవడం ద్వారా న్యాయం నుంచి తప్పించుకోవాని చూశారు. దీనిద్వారా ఈ దేశ చట్టాన్ని ఉల్లంఘించినట్లు చాటిచెప్పారు.’’ అంటూ జడ్జి వ్యాఖ్యలు చేశారు.