ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా, లోకాయుక్తగా సేవలు అందించిన జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి 2019 మే 1న హైదరాబాద్‌లో మృతిచెందారు.

  • జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి హైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేటలో భూస్వామి ఆగారెడ్డి, శకుంతలాదేవి దంపతులకు 1943 మార్చి 2న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, తర్వాత న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ముగ్గురు కుమారుల్లో చంద్రసేన్‌రెడ్డి, విజయసేనారెడ్డిలు న్యాయవాదులు. మూడో కుమారుడు ఇంద్రసేన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు.
  • జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి 1966 జనవరి 10న బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదుచేయించుకున్నారు.
  • 1991 నవంబరు 25న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ అధ్యక్షుడిగా, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. న్యాయపరమైన అవగాహనా శిబిరాలు నిర్వహించారు. జ్యుడీషియల్‌ అకాడమీ అధ్యక్షులుగా జ్యుడీషియల్‌ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే విధానంలో సమగ్రమైన మార్పు తెచ్చారు.
  • 2001 సెప్టెంబరు 12న మద్రాసు ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంతో పాటు మద్రాసు హైకోర్టు బెంచ్‌లో కీలకప్రాత పోషించారు. మదురైలో హైకోర్టు భవనం కూడా కట్టించి దక్షిణ తమిళులకు కూడా ఉన్నత న్యాయస్థానం అనుకూలంగా ఉండేలా దూరదృష్టితో చర్యులు తీసుకున్నారు.
  • 2004లో కేరళ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా 4 నెలలు సేవలను అందించారు. 2005 మార్చి 2న బాధ్యత నుంచి విమరణ పొందారు.
  • వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008 ఆగస్టు 12న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటైంది. దానికి తొలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. తర్వాత లోకాయుక్తగా జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు.