గూగుల్‌ను మాజీ సీఈవో ఎరిక్‌ ష్మిట్‌ ఆ సంస్థ బోర్డు నుంచి నిష్క్రమించనున్నారు. 2019 జూన్‌లో ఆయన తప్పుకోనున్నట్లు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వెల్లడించింది. 2018లో ఆల్ఫాబెట్‌ చైర్మన్‌ పదవి నుంచి ష్మిట్‌ తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పటికీ .. సాంకేతిక సలహాదారు పాత్రకే పరిమితమయ్యారు. జూన్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది.

  • ప్రముఖ వ్యాపారవేత్త, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ష్మిట్‌ను సీఈవోగా 2001లో గూగుల్‌ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ రిక్రూట్‌ చేశారు. అప్పటికి గూగుల్‌ ప్రారంభమై మూడేళ్లే అయింది. ఆ తర్వాత నుంచి సంస్థను భారీగా విస్తరించటంలో పేజ్‌, బ్రిన్‌తో పాటు ష్మిట్‌ కీలక పాత్ర పోషించారు. 2001 నుంచి 2011 వరకు గూగుల్‌ సీఈవోగా వ్యవహరించారు. తర్వాత ష్మిట్‌ స్థానంలో పేజ్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గూగుల్‌కు ఆల్ఫాబెట్‌ పేరుతో కొత్తగా మాతృసంస్థ ఏర్పాటైంది. ఆల్ఫాబెట్‌ సీఈవోగా పేజ్‌, గూగుల్‌ సీఈవోగా ప్రవాస భారతీయులు సుందర్‌ పిచాయ్‌ నియమితులయ్యారు.