మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టు 2019 మే 1న ప్రైవేటు వాహనంలో వస్తున్న పోలీసు బలగాలే లక్ష్యంగా శక్తిమంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో సి-60 కమాండోలు 16 మంది మృతి చెందారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే మావోయిస్టు ఈ దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని గడ్చిరోలి అడవి మవోయిస్టు ప్రాబల్య ప్రాంతం.
సి-60 కమాండోలు..
సాధారణంగా మావోయిస్టు వ్యతిరేక చర్యలో పాల్గొనేందుకు శిక్షణ పొందిన దళాలన్నీ రాష్ట్రస్థాయి బగాలు అయి ఉంటాయి. సి-60 కమాండోలు మాత్రం పూర్తిగా గడ్చిరోలి జిల్లాలో స్థానిక గిరిజనులలో మెరికల్లాంటి యువకులను ఎంపికచేసి రూపొందించిన జిల్లాస్థాయి దళం. అదనపు డీజీ కేపీ రఘువంశీ(రిటైర్డ్‌) 1989-90 మధ్య గడ్చిరోలి ఎస్పీగా ఉన్నప్పుడు ఈ దళాన్ని సిద్ధం చేశారు. ‘వీరభోగ్య వసుంధర’ (ధైర్యవంతులే ప్రపంచాన్ని ఏలుతారు) అన్నది ఈ దళం ట్యాగ్‌లైన్‌. ఈ దళం మొట్టమొదట రూపొందినపుడు అందులో 60 మందే ఉండడంతో దీనికి సి-60 అని పేరుపెట్టారు. వీళ్లకు అక్కడి చెట్టు, పుట్ట, కొండ, కోన అన్నీ కొట్టిన పిండి కావడం, గిరిజన భాషలన్నీ వచ్చి ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మావోయిస్టు నాయకుల కంటే వీరిదే పైచేయి అవుతుంది. అందుకే ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులను వారు మట్టుపెట్టగలిగారు. మొదట్లో కేవలం 15 పార్టీలతో మొదలైన సి-60 కమాండోలో ఇప్పుడు 24 పార్టీలున్నాయి. వీరికి అత్యాధునిక ఆయుధాలు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. గ్రేహౌండ్స్‌, ఎస్‌ఓజీ లాంటి ఇతర రాష్ట్రాల బలగాల వ్యూహాలలోనూ ఈ దళాన్ని తీర్చిదిద్దారు.