కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులకూ వెనుకాడం

రోనా మహమ్మారి.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం మంచి పద్ధతిలోనే చెప్పి ముందుకు పోయేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు దానికి 100 శాతం సహకరించాలి. అమెరికాలాంటి దేశం పోలీసులతో నియంత్రించలేక సైన్యాన్ని దింపింది. మన దగ్గర కూడా ప్రజలు పోలీసులకు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలివ్వాల్సి వస్తుంది. అప్పటికీ నియంత్రణ కాకపోతే సైన్యాన్ని మోహరించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి తెచ్చుకుందామా.. ఆలోచించండి.

కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు తెలంగాణలో మంగళవారం నుంచి ఈనెల 31 వరకు రాత్రి పూట కర్ఫ్యూను విధిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు నడుస్తాయని, ఆ సమయంలో సరకులను తెచ్చుకోవాలని సూచించారు. రాత్రిపూట ఇంట్లోంచి ప్రజలు బయటికి రావద్దని, ఏమైనా అత్యవసర సాయం అవసరమైతే 100 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు. జనం స్థానిక పోలీసుల మాట వినకపోతే 24 గంటల కర్ఫ్యూ విధిస్తామని, అప్పటికీ మాట వినకపోతే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని.. అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించుతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆ పరిస్థితి తేవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో అధిక ధరలకు అమ్మే వ్యాపారుల లైసెన్స్‌ రద్దు చేస్తామని.. క్రిమినల్‌ కేసుల కింద జైలుకు పంపుతామని, పీడీ చట్టం ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని నియంత్రించేందుకు వారి పాస్‌పోర్టులను సీజ్‌ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా ఇబ్బందికరంగా మారినా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం కరోనాపై ఆయన అత్యవసర, అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్షలో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారెవరికీ ప్రమాదం లేదు. అందరూ కోలుకుంటున్నారు. వీరంతా ఏప్రిల్‌ 7కల్లా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోతారు. వీరుకాకుండా 14 మంది కరోనా అనుమానితులున్నారు. మరో 19313 మంది నిఘాలో ఉన్నారు. నిర్మల్‌లో ఒక పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తి మూడుసార్లు తప్పించుకుపోయాడు. హోం క్వారంటైన్లో ఉన్న వారిపై గట్టి నిఘా పెట్టాలి. ప్రజలు 100 శాతం సహకరించాలి. సమాజ శ్రేయస్సుకు భంగం కలిగిస్తే సమాజం నుంచి వారు ప్రయోజనాలు పొందే అవకాశం లేదు.

ధరలను పెంచొద్దు
‘‘కొన్ని కూరగాయల ధరలు పెంచి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడం బాధాకరం. రాష్ట్రంలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తవుతాయి. ఇందులో 27 లక్షలు వినియోగిస్తాం. 3 లక్షల టన్నులు మిగులుతాయి. ధరలు పెంచుతామంటే సహించేది లేదు. ఎక్కువ ధరలకు అమ్మితే పీడీ చట్టం అమలు చేసి జైలుకు పంపుతాం. నిత్యావసరాల ధరలు పెంచినా దుకాణాలు సీజ్‌ చేస్తాం. వారిని శాశ్వతంగా బ్లాక్‌ లిస్టులో పెడతాం.

అంతా మీ కోసమే
లాక్‌డౌన్‌, కర్ఫ్యూ మనకోసం మన పిల్లల కోసం బతుకు కోసం… మేం అనుక్షణం మీ గురించే పనిచేస్తున్నాం. నేను, మంత్రులు, సీఎస్‌, డీజీపీ, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు అహర్నిశలు ఆలోచిస్తున్నాం. ప్రజలు ఒకచోట గుమిగూడవద్దు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా.. నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఎక్కువ దూరం కూడా పోలేరు. విపరీతమైన చెక్‌పోస్టులున్నాయి. కూరగాయలు కానీ, నిత్యావసరాలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. ఎవరూ వినకపోతే పెట్రోల్‌ బంకులు మూసేయాల్సి వస్తుంది.

రాష్ట్రానికి నష్టమైనా…
రోజుకు వందల కోట్ల రూపాయలను నష్టపోతున్నాం. అయినా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆరోగ్య శాఖకు నిధుల కొరత రావొద్దు. ఎల్లుండి నుంచే బియ్యం పంపిణీ ప్రారంభిస్తాం. రూ.1500 ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాల్లో వేస్తాం. క్లిష్ట పరిస్థితుల్లో కూరగాయలు, పాలు, మందులు ఎట్లా అనే దానిపై అధికార యంత్రాంగం యోచిస్తోంది.

నియంత్రణ పాటించాలి
చాలా గ్రామాలు కంచెలు వేసుకుంటున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు చాలా వరకు బాగున్నాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండలోనూ పరిస్థితులు ఆదుపులోకి రావాలి. స్థానికంగా వ్యాధి వాపిస్తున్న కేసులు లేవు. ఈరోజు నుంచి విమానాశ్రయాలు, దేశీయ విమానాలు రద్దు. ఓడరేవులు, రైళ్లు ఉండవు. ఒకచోట నుంచి మనకు జబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారితో చేరుకున్న వైరస్‌ను నివారించాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును నేను అభినందిస్తున్నా. ఆయన తన మనుమరాలి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. సమాజ హితాన్ని కోరేవారు ఇలా స్వయం నియంత్రణ పాటించాలి. రష్యా తన దేశాన్ని అద్భుతంగా కాపాడుకుంటోంది. ఇంట్లో ఉంటారా ఐదేళ్లు జైల్లో ఉంటారా అని ఆ దేశాధ్యక్షుడు హెచ్చరించగా… అక్కడ అందరూ దారిలోకి వచ్చారు.

వారి పనితీరు భేష్‌
‘‘జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్యఆరోగ్యం, పురపాలక, గ్రామీణాభివృద్ధి, శాఖల వారు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఉన్న డాక్టర్లను కాపాడుకునేలా మంత్రి ఈటల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు శాఖ కూడా ముఖ్యం. మెట్రోరైళ్లలో ఉన్న పోలీసు సిబ్బందిని అక్కడి నుంచి ఉపసంహరించుకొని సాధారణ విధుల్లో చేర్చుకున్నాం. పోలీసులు మన మేలు కోసమే ఆపుతున్నారు.

మీడియాతో దురుసు ప్రవర్తన వద్దు
పోలీసులకు నేను చెబుతున్నా.. లాక్‌డౌన్‌లో మీడియాను అనుమతించాం. వారితో ఘర్షణ పద్ధతి వద్దు. ఆపత్కాల సమయంలో ఈ ధోరణి సబబు కాదు. మీడియా వారు సమాజం కోసం పనిచేస్తారు. వారి ద్వారానే మన వార్తలు ప్రజలకు చేరుతాయి. వారిపట్ల కఠినంగా ఉండొద్దు. సంయమనం పాటించండి.

ధాన్యం మార్కెట్లకు తేవొద్దు
వరి, మొక్కజొన్న పంటలు రైతుల చేతికొచ్చాయి. వారెవరూ మార్కెట్లకు రావద్దు. ఇప్పటికే మార్కెటింగు శాఖకు ఆదేశాలు జారీ చేశాం. వ్యవసాయోత్పత్తులు వారి ఊళ్లలోనే అమ్ముకోవడానికి, కొనడానికి కేంద్రాలు పెడుతున్నాం. కూపన్లు ఇచ్చి కొనుగోలు చేయిస్తాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీలకు సూచనలు ఇచ్చాం. రైతుబంధు సమితి సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి.

గ్రామాల్లో పనులన్నీ జరగాలి
వ్యాధి ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. గ్రామాల్లో వ్యవసాయ పనులకు అనుమతిస్తున్నాం. 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి. అవి వస్తేనే మనకు తిండి గింజలు దొరుకుతాయి. కూలీలకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. వాటిని దూరదూరంగా ఉంటూ కొనసాగించాలి. నీటిపారుదల పనులు కూడా దూరంలో జరుగుతాయి కాబట్టి గుంపులుగా కాకుండా పనిని కొనసాగించాలి. కార్మికులు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు?
ప్రజాప్రతినిధుల జాడ లేదు. హైదరాబాద్‌ నగరంలో 150 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు కమిషనరేట్ల ఎమ్మెల్యేలందరూ తక్షణమే పనులు చేపట్టాలి. ట్రాఫిక్‌ నియంత్రణలో మనమూ ఉండాలి. మంత్రులంతా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉండాలి. వారితో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బయట కనిపించాలి, చెక్‌పోస్టుల వద్ద ఉండాలి. కూరగాయల ధరలు, సరఫరా చూడాలి. సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు కధానాయకులుగా మారాలి. పంచాయతీలు, పురపాలక, నగర పాలక సంస్థల్లోని పది లక్షల స్థాయీ సంఘాల సభ్యులంతా రంగంలోకి దిగాలి.

కవులు, కళాకారులు స్పందించాలి
కరోనాపై కవులు అద్భుతమైన కవితలు రాస్తున్నారు. అయినంపూడి లక్ష్మి అనే కవయిత్రి ‘‘ఇది క్వారంటైన్‌ కాదు.. వాలంటైన్‌’’ అని చక్కటి కవిత రాశారు. మనదగ్గర ఎంతో మంది కవులు, కళాకారులు ఉన్నారు. అందరూ కవితలు
రాసి ప్రజల్లో చైతన్యం తేవాలి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!