పాకిస్థాన్‌ ప్రేరేపిత జైష్‌ ఎ మహ్మద్‌ అధిపతి మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిని నిషేధ జాబితాలో చేర్చే అంశంపై పదేళ్లుగా అడ్డుపడుతూ వచ్చిన చైనా అంతర్జాతీయ ఒత్తిడితో తన వైఖరిని మార్చుకోవడంతో ఇందుకు మార్గం సుగమమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయం వల్ల అన్ని దేశాలూ తక్షణం అజార్‌, అతడి సంస్థ ఆస్తులు, ఆర్థిక వనరులను స్తంభింపచేయాల్సి ఉంటుంది. ఆయుధ విక్రయాలు చేపట్టకూడదు. అతడి ప్రయాణాలపై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఐక్యరాజ్యసమితి తీర్మానంలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్ర దాడి ప్రస్తావన లేదు.
కరడుగట్టిన ఉగ్రవాది అయిన మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్‌ పదేళ్లుగా ప్రయత్నిస్తోంది. భద్రతా మండలిలో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశల హోదాలో చైనాయే ఈ ప్రయత్నాలన్నింటికీ అడ్డుపడుతూ వచ్చింది. అజార్‌పై వచ్చిన ప్రతిపాదనను ‘సాంకేతిక నిలుపుదల’లో ఉంచింది. ఆంక్షల కమిటీ తన నిర్ణయాలన్నింటినీ ఏకాభిప్రాయం ద్వారానే తీసుకుంటుంది. 2019 ఫిబ్రవరిలో జైష్‌ ముఠా జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిన కొద్దిరోజులకు భద్రతా మండలిలోని ‘1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ’ ఎదుట ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికా మరోసారి ఈ ప్రతిపాదన పెట్టాయి. యథావిధిగా చైనా 2019 మార్చి 13న ఆ ప్రతిపాదనపై ‘సాంకేతిక నిలుపుదల’ విధించింది. పరిశీలనకు మరింత సమయం కావాలంది. అయినా భారత్‌ పట్టువదలకుండా మిత్రదేశాలతో ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అభ్యంతరపెట్టవద్దంటూ చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా అమెరికా గట్టిగా ప్రయత్నించింది. దీనిపై తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరిగాయి. చైనా ఇలాగే మోకాలడ్డుతూ ఉంటే భద్రతా మండలిలోని బాధ్యతాయుత దేశాన్నీ ‘ఇతర చర్యలకు’ పూనుకోవాల్సి వస్తుందని కొన్ని దేశాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో చైనా మెత్తబడింది. అజార్‌ విషయంలో తన అభ్యంతరాలను ఉపసంహరించుకుంటున్నట్లు 2019 ఏప్రిల్‌ 30న సంకేతాలిచ్చింది. ఈ మేరకు చైనా తన సాంకేతిక నిలుపుదలను తొలగించింది. దీంతో ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ 2019 మే 1న మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు ఆర్థిక నిధులు సమీకరణ, ప్రణాళిక, ముష్కరుల నియామకం, ఆయుధాల సరఫరా, విక్రయం, జైష్‌ ఎ మహ్మద్‌తో ముడిపడిన ఇతర వ్యవహారాలకు సంబంధించి అతడికి అల్‌ఖైదాతో సంబంధం ఉందని నిర్ధరిస్తున్నట్లు తెలిపింది.
అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తే ఏమవుతుంది…
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం వల్ల మసూద్‌ అజహర్‌కు వివిధ దేశాలో ఉన్న ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు అతడిపై ప్రయాణ నిషేధం కూడా విధిస్తారు. ఆయుధాలు కొనుగోలు చేయడానికి వీలుండదు. అతడితో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల ఆస్తులు, ఆర్థిక వనరులన్నింటినీ ఎలాంటి ఆలస్యం లేకుండా స్తంభింపజేయాల్సి ఉంటుంది.